iCafe Search
ఆక్సిజన్ విడుదల చేసే ఆకులాంటి కారు
Wednesday, 26 May 2010ఆధునిక వాహనాలు వదిలే పొగలో కార్బన్ డై ఆక్సైడ్ (సీఓ2)తో పాటు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు ఉండడంతో పర్యావరణ కాలుష్యం కలుగుతోంది. అయితే.. ఆయా వాహనాలు మొక్కలకు మల్లే సీఓ2ను పీల్చుకుని ప్రాణవాయువును వదిలితే.. ఇంకేం పర్యావరణం భేషుగ్గా ఉంటుంది. ఆ ఆలోచన చైనీయులకు వచ్చింది.
వచ్చిందే తడవుగా షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్(ఎస్ఏఐసీ) ఈ మేరకు ఒక డిజైన్ చేసింది. చైనాలో జనరల్ మోటర్స్‌తో భాగస్వామి అయిన ఎస్ఏఐసీ.. ఇటీవల షాంఘైలో జరిగిన ఎక్స్పో 2010లో ఈ డిజైన్‌ను ప్రదర్శించారు. కిరణజన్య సంయోగ క్రియ మాదిరిగా పని చేసే ఈ కారుకు 'ఆకు' అని మండారిన్ భాషలో అర్థం వచ్చే విధంగా "ఇయా జి'' అని పేరు పెట్టారు.
సాంకేతిక వివరాల్లోకి వెళితే కారు పైభాగం సౌరశక్తిని గ్రహించి దానిని విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. 'మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్'గా చెబుతున్న ఈ కారు బయటి భాగం సీఓ2ను నీటి ఆవిరితో సహా పీల్చుకుని విద్యుచ్ఛక్తిగా మార్చి.. లిథియం అయాన్ బ్యాటరీలో నిక్షిప్తం చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది.